విజయవాడ:08-10-25:విజయవాడ నగరపాలక సంస్థ (VMC) కౌన్సిల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పాముల మాల కొండయ్యల మృతికి కౌన్సిల్ సభ్యులు సంతాపం తెలిపారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు.
సమావేశం ప్రారంభానికి ముందు సభ్యులు ఒక్క నిమిషం మౌనం పాటించి, వారు చేసిన సేవలను స్మరించారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన కోట శ్రీనివాసరావు మరణాన్ని సినీ రంగానికీ, రాజకీయ రంగానికీ తీరని లోటుగా పేర్కొన్నారు. ప్రజా సేవలో ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని సభ్యులు అన్నారు.
అలాగే, 47వ డివిజన్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ మాల కొండయ్య నగరాభివృద్ధికి చేసిన కృషిని సభ గుర్తుచేసింది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని సభ ఆకాంక్షించింది.
ఈ సందర్భంగా, నగరపాలక సంస్థ దేశవ్యాప్తంగా జరిగిన స్వచ్ఛత సర్వేక్షణలో నాలుగవ స్థానం సాధించడంపై కౌన్సిల్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రజలు, అధికారులు చేసిన కృషిని సభ అభినందించింది.