హైదరాబాద్ నగరంలో వరుస నేర సంఘటనలు ఆందోళనకు లోను చేస్తున్నాయి. తాజాగా మలక్‌పేట్‌లోని శాలీవాహననగర్ పార్క్ లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన నగరాన్ని కుదిపేసింది. సీపీఐ నేత చందూ రాథోడ్ పై దుండగులు కాల్పులు జరిపి పరారైన ఘటన కలకలం రేపుతోంది.
ఏం జరిగింది?
మంగళవారం ఉదయం వాకింగ్‌కి వెళ్లిన చందూ రాథోడ్‌పై దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులతో కలిసి వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలోనే దుండగులు ముందుగా అతడి కళ్లలో కారం చల్లి, వెంటాడుతూ నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, దుండగులు ముందుగా చందూ పై కారం చల్లి గన్‌తో వెంటాడుతూ దాడి చేసినట్లు తెలిపారు.
ఎక్కడ జరిగింది?
నాగరకర్నూల్ జిల్లా అచ్చంపేటకి చెందిన చందూ రాథోడ్ కొంతకాలంగా తన కుటుంబంతో కలిసి చైతన్యపురిలో నివసిస్తున్నాడు. ప్రతిదినం లాగే మలక్‌పేట్ శాలీవాహననగర్ పార్క్ కి వాకింగ్‌కి వెళ్లగా, ఈ ఘటన జరిగింది. దుండగులు స్విఫ్ట్ కారులో వచ్చి ఈ దాడి చేసి పరారయ్యారు.
ఎందుకు జరిగింది?
చందూ రాథోడ్‌కు సీపీఐలోనే మరో నేత రాజేష్‌తో విబేధాలు ఉన్నాయని తెలుస్తోంది. రాథోడ్ కుటుంబసభ్యులు ఈ హత్యకు రాజేష్ హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాతకక్షలే చందూ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
కాల్పుల అనంతరం పరిస్థితి:
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాథోడ్ పై ఐదుగురు వ్యక్తులు కలిసి ఈ దాడి జరిపినట్లు స్థానికులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తు:
• పరిసర ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
• దుండగులు వాడిన కారు రూట్ ను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
• సీపీఐ లో అంతర్గత విభేదాల కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
• అనుమానితులను పోలీసులు త్వరలో విచారణకు పిలుస్తారని సమాచారం.
సీపీఐలో టెన్షన్:
సీపీఐ నేత చందూ రాథోడ్ హత్యతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే సీపీఐ కార్యకర్తలు పోలీసులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చందూ రాథోడ్ కు పార్టీకి చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ పలువురు సీపీఐ నేతలు నివాళులు అర్పించారు.