
హైదరాబాద్ | అక్టోబర్ 21:-విధి నిర్వాహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు – “పోలీస్ అంటే ఒక భరోసా”.1959 అక్టోబర్ 21న భారత్–చైనా సరిహద్దులో వీర మరణం పొందిన జవాన్ల త్యాగాన్ని స్మరించుకున్న ఆయన, గత 66 సంవత్సరాలుగా ఈ రోజును పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.రాష్ట్రంలో 6 మంది పోలీసులు విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయారని, దేశవ్యాప్తంగా 191 మంది అమరులైనట్లు తెలిపారు. ఇటీవల నిజామాబాద్ CCS కానిస్టేబుల్ ప్రమోద్ వీరమరణం పొందారని గుర్తు చేశారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, కోటి రూపాయల సాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు.
33 మంది పోలీసుల కుటుంబాల కోసం గాజులరామారం లో స్థలాలను కేటాయించామని తెలిపారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీస్ అగ్రగామిగా నిలవడం గర్వకారణమని పేర్కొంటూ, “తీవ్రవాదం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణలో పోలీస్ శాఖ విశేష కృషి చేస్తోంది” అని ముఖ్యమంత్రి అభినందించారు.డ్రగ్స్ నిర్మూలన కోసం “ఈగల్” ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాలను అదుపులోకి తెచ్చే విషయంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే ఆదర్శంగా ఉందని ప్రశంసించారు.మావోయిస్టు కార్యకలాపాలను అణచడంలో పోలీసుల ధైర్యం మరువలేనిదని పేర్కొన్నారు. మహిళా IPS లను వివిధ కీలక విభాగాల్లో నియమిస్తున్నామని తెలిపారు. పోలీస్ సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలో ఎక్కడా లేని విధంగా అమరవీరుల కుటుంబాలకు బెనిఫిట్స్ అందిస్తున్నామని వెల్లడించారు.పోలీస్ పిల్లల విద్య కోసం రంగారెడ్డి జిల్లాలో “యంగ్ ఇండియా పోలీస్ స్కూల్” ప్రారంభించామని, క్రీడాకారులకు కూడా పోలీస్ ఉద్యోగాలు కల్పించామని సీఎం తెలిపారు.

డీజీపీ శివదర్ రెడ్డి మాట్లాడుతూ,
“అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేము. ఈ సంవత్సరం 191 మంది పోలీసులు విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయారు” అని తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చూపుతున్న సేవలు ప్రశంసనీయమని, నేర నియంత్రణలో అనేక నూతన సంస్కరణలను పోలీస్ శాఖ అమలు చేస్తున్నదని అన్నారు. తెలంగాణ పోలీస్ దేశంలోనే ఉత్తమ పోలీసింగ్‌గా నిలుస్తోందని గర్వంగా పేర్కొన్నారు.“అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అండగా ఉంటుంది. వారి త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. వారి ఆత్మలకు శాంతి కలగాలి” అని డీజీపీ శివదర్ రెడ్డి ఆకాంక్షించారు.







