
హైదరాబాద్, అక్టోబర్ 21 :-విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాల సృష్టి లక్ష్యంగా “గ్లోబల్ టీపీఓ అండ్ హెచ్ఆర్ సమ్మిట్ – 2025” ను డిసెంబర్ 5, 6 తేదీలలో హైదరాబాద్ గచ్చిబౌలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (NITHM) లో నిర్వహించనున్నట్లు టీపీఓ అధ్యక్షుడు ప్రొఫెసర్ జయరాం తెలిపారు.బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో సమ్మిట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను టీపీఓ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించిన ఆయన, ఈ సందర్భంగా మాట్లాడుతూ — ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
సమ్మిట్‌లో 24 రాష్ట్రాల ప్రతినిధులు, హెచ్‌ఆర్ నిపుణులు, సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు. విద్యార్థుల్లో ప్రతిభాభివృద్ధి, సాంకేతికత, పారిశ్రామికత, పర్యాటక రంగాల్లో అవకాశాలపై నిపుణులు సూచనలు, మార్గదర్శకాలు అందించనున్నారని వివరించారు.ప్రొఫెసర్ జయరాం తెలిపినట్లు, డిసెంబర్ 5న సమ్మిట్ ప్రారంభమై పరస్పర బృంద చర్చలు, సాంకేతిక సెషన్లు జరుగుతాయి. 6న ముగింపు సమావేశం, అవార్డు ప్రధానోత్సవం నిర్వహించనున్నారు.





