
- నకిలీ మద్యంపై లోతైన దర్యాప్తునకు ఐదుగురితో సిట్
- ఇప్పటికే షాకింగ్ వాస్తవాలు… విచారణలో మరిన్ని బయటపడతాయి
- ఆఫ్రికాలో అలవాటు పడ్డారు… ఆంధ్రాలో అమలు చేస్తున్నారు
- నేరాలు చేయడం… నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేయడం అలవాటైంది
- కల్తీ మద్యంతో ప్రాణాలు తీసినవారికి సీట్లు ఇచ్చి గెలిపించారు…మేం సస్పెండ్ చేశాం
అమరావతి, అక్టోబర్ 12: నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్ తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత పాలకులు ఎక్సైజ్ శాఖను సర్వనాశనం చేశారని… ఇప్పుడు దాన్ని గాడిలో పెట్టినా… వారసత్వంగా వచ్చిన సమస్యలను కూడా అధిగమించేందుకు టెక్నాలజీ వినియోగంతో యాప్ రూపొందించినట్టు సీఎం వెల్లడించారు. అలాగే కల్తీ మద్యంపై దర్యాప్తునకు ఐదుగురు అధికారులతో సిట్ ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాప్ పనితీరును వివరించడంతోపాటు కల్తీ మద్యం కట్టడికి తీసుకుంటున్న చర్యలు.. మద్యం విషయంలో కొందరు చేస్తున్న కుట్రలను ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…”కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటి. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఏరులై పారించింది.. వ్యవస్థీకృతం చేసింది. వాణిజ్య పంటలా గత పాలకులు గంజాయిని పండించారు… గంజాయి సరఫరా చేశారు. గత ప్రభుత్వంలోని పెద్దలు… తమ మనుషులకు చెందిన కంపెనీల బ్రాండ్లనే అమ్మారు. బలవంతంగా డిస్టలరీలు హ్యండోవర్ చేసుకున్నారు.. ఓ నేర సామ్రాజ్యాన్ని సృష్టించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్సైజ్ వ్యవస్థను గాడిలో పెట్టాం.. బెస్ట్ పాలసీ తెచ్చాం. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం దోపిడీపై సిట్ వేశాం… విచారణ జరగుతోంది. గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రానికి వచ్చేది. గత పాలనలో నాణ్యమైన మద్యం లేకపోవడం… ధరలు విపరీతంగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి అయ్యేది. ఇప్పుడు అలాంటివన్నీ కంట్రోల్లో పెట్టాం. అయినా మద్యం విషయంలో ఇంకా కొందరు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు. నేరాలు చేయడం… ఎదుటి వారిపై ఆ నేరాల్ని మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.” అని సీఎం అన్నారు.
షాకింగ్ వాస్తవాలు తెలుస్తున్నాయి…
“ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించాం. వీరిలో 16 మందిని అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నం కేసులో 12 మంది నిందితులను గుర్తించగా ఏడుగురిని అరెస్టు చేశారు. 4 పీటీ వారెంట్‌లు నమోదు చేశారు. ఈ కేసు మూలాల్లోకి పోతే షాకింగ్ వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అరెస్టులతో మరిన్ని నిజాలు బయటకు వస్తాయి. తీగ లాగితే డొంక కదులుతోంది. దీనిపై మరింత విచారణ కోసం ఐదుగురు సభ్యులతో సిట్ వేస్తున్నాం. ములకలచెరువు ఘటన బయట పెట్టిందే మేము. అరెస్టులు చేసింది మేము.. వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడిస్తుంది కూడా మేము. సిట్ విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయి… ఎవరూ తప్పించుకోలేరు. ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారు చేయడానికి అలవాటు పడ్డారు… ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నారు. ఈ కల్తీ మద్యం వెనుక ఎవ్వరున్నా చర్యలు తీసుకుంటాం…రాజీపడే ప్రసక్తే లేదు. మా పార్టీ వాళ్లపై ఆరోపణలు ఉన్నా.. సస్పెండ్ చేశాం. కుట్రల్లో భాగంగా శవ రాజకీయాలు చేస్తున్నారు. తండ్రి చనిపోతే శవ రాజకీయం చేశారు. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ వేయలేదు.. పోస్ట్ మార్టం కూడా సరిగా నిర్వహించలేదు. ఇలాంటి వాళ్లు ఇప్పుడు శవ రాజకీయాలు చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లే కుట్రలు పన్నుతున్నారు… సీబీఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు. ఇప్పటికే చాలా సీబీఐ కేసులున్నాయి… కాలక్షేపం చేయొచ్చని సీబీఐ విచారణ కావాలని పట్టుబడుతున్నారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం వల్ల చాలా మంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. ఏలూరులో ఒకరు చనిపోయారని చెబితే నేను అలెర్ట్ అయ్యాను.. పరీక్షలు చేయించాను. అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన వాళ్లని కూడా కల్తీ మద్యంతో చనిపోయారని కుట్రలు పన్నుతున్నారు.” అని ముఖ్యమంత్రి అన్నారు.
తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టం…
“కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుంది. ఎక్కడా, ఎవ్వరితోనూ మేం లాలూచీ పడం.. తప్పు చేస్తే తన మన బేధం చూడం. వ్యాపారం చేసుకోవాలంటే చేయొచ్చు… కానీ ఒళ్లు దగ్గర పెట్టుకుని పద్దతిగా వ్యాపారాలు చేసుకోవాలి. తప్పుడు ప్రచారాలు చేసిన వారి ఆటలు ఇక సాగనివ్వం. వాస్తవాలుంటే చర్యలు తీసుకుంటాం… కావాలని దుష్ప్రచారం చేస్తే వదిలి పెట్టం. ఎక్సైజ్ శాఖ సిబ్బంది కూడా సరిగా పని చేయాలి. ప్రతి చోటా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. మద్యం ఉత్పత్తిదారుల మొదలుకుని మద్యం విక్రయాలు చేసేవారంతా పద్దతిగా పని చేయాలి. కాకాణిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు||Somireddy Chandramohan Reddy Sensational Comments on Kakani
ఎక్సైజ్ అధికారులు కానీ.. సిబ్బంది కానీ నిర్లక్ష్యంతో ఉంటే చర్యలు తప్పవు. తప్పు చేసిన వాళ్లు ఆఫీసర్లు కావచ్చు… రాజకీయ నేతలు కావచ్చు కచ్చితంగా చర్యలు ఉంటాయి. ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరిగాయని ప్రజలను నమ్మించడానికే ఈ కుట్రలు. నేరాలు వాళ్లే చేస్తారు… వాటిని ప్రభుత్వంపై మోపుతున్నారు… ఆ తర్వాత అలజడి సృష్టిస్తున్నారు. ఇదేమన్నా కొత్తా… వివేకా హత్య విషయంలో ఏమైంది..? అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తే ఎవ్వర్నీ ఊపేక్షించం. గతంలో ఓ బార్ లో నకిలీ మద్యంతో మనుషులు ప్రాణాలు తీసిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి గెలిపించారు.. కానీ మేం ఆరోపణలు రాగానే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. కరడు గట్టిన నేరస్తులు నేరాలు-ఘోరాలు చేసినా ధైర్యంగా అబద్దాలు చెప్పగలరు. వీక్ స్పాట్స్, వీక్ పర్సన్స్ ను ఎంచుకుని కుట్రలు పన్నుతున్నారు… అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా. గతంలో ఎవ్వరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా..? నాటి పాలకులు ప్రశ్నించే అవకాశమిచ్చారా..? కానీ మేం ప్రశ్నలను ఆహ్వానిస్తాం… ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం.” అని ముఖ్యమంత్రి చెప్పారు.
సిట్ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు vijayawada news:సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమితి మీడియా మీట్
“నకిలీ మద్యం కట్టడికి టెక్నాలజీ వినియోగించుకుంటున్నాం… అందుకే యాప్ తెచ్చాం. బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్‌కు సంబంధించిన అన్ని వివరాలు వస్తాయి. రిటైల్ షాపుల్లో కూడా స్కాన్ చేసిన తర్వాతే మద్యం అమ్మాలనే విధానాన్ని తెస్తున్నాం. వినియోగదారులు కూడా మద్యం బాటిళ్ల వివరాలను యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మద్యం తయారీ తేదీ, టైమ్, బ్యాచ్ నెంబరు ఇలా అన్ని వివరాలు ఉంటాయి. ట్రెసబులిటీ, సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఓ షాపునకు సరఫరా చేసిన మద్యం… వేరే షాపులో అమ్మడానికి కూడా వీల్లేదు. బెల్ట్ షాపులనేవి లేకుండా ఉండేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ రేపట్నుంచే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. నకిలీ మద్యం కేసుపై దర్యాప్తు వేగవంతం చేసేందుకు, మరింత లోతుగా విచారణ జరిపేందుకు సిట్‌తో దర్యాప్తు చేయిస్తున్నాం. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ప్రొహిబిషన్-ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఐపీఎస్ అధికారులు కె చక్రవర్తి, టి శ్రీనివాసరావు, మల్లికా గార్గ్ సిట్ దర్యాప్తు బృందంలో ఉంటారు. సిట్ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.”అని ముఖ్యమంత్రి అన్నారు.
విశాఖ పెట్టుబడుల సదస్సుకు ప్రధానిని ఆహ్వానిస్తాం
“14వ తేదీన చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం…నా రాజకీయ జీవితంలో ఇది అపూర్వ ఘట్టం. గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. రాష్ట్రం విధ్వంసానికి గురైంది… ఇప్పుడు బ్రాండ్ ను తిరిగి పునర్ నిర్మించాం. గూగుల్ సంస్థ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతోంది. దేశంలో అతి పెద్ద డేటా హబ్‌గా విశాఖ మారబోతోంది. ఓవైపు డేటా సెంటర్… మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్ రూపొందిస్తున్నాం. ఎప్పుడైనా ఈ స్థాయిలో పెట్టబడులు వస్తాయని ఊహించామా..? పరిశ్రమలకు కొందరు అడ్డుపడుతున్నారు… ఇది మంచిది కాదు. పెట్టుబడులు రాకుండా చేయడం… బెదిరించడం అనేది కొందరికి ఫ్యాషన్‌గా మారింది. నవంబరులో జరిగే పెట్టుబడుల సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తాం.” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.







