
హైదరాబాద్, నవంబర్ 5:-రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు పూర్తయ్యాక, కోర్టు తీర్పులను సాకుగా చూపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ముందుకు సాగుతోందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు.బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైకోర్టులో గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న 42 శాతం బిల్లుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గుర్తు చేయలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకే అవగాహనతో పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
కేంద్రం ద్వారానే సాధ్యమయ్యే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకుండా, కేంద్ర అప్రకటిత అనుబంధ సంస్థల జీవోలతో ‘రిజర్వేషన్ పెంపు’ అనే ముసుగులో బీసీల హక్కులను హరిస్తోందని ఎర్ర సత్యనారాయణ విమర్శించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజ్యాంగబద్ధమైన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా, పాత విధానంతోనే ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని ఆరోపిస్తూ, ఆయనను “బీసీలకు ప్రత్యక్ష శత్రువుగా” అభివర్ణించారు. రేవంత్ రెడ్డి హటావో నినాదంతో ఉద్యమ శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.BCఈ నెల 9న గద్వాల్‌లో, 22న నిజామాబాద్‌లో, 27న సూర్యాపేటలో, 30న మహబూబ్‌నగర్‌లో “బీసీ గర్జన మహాసభలు” నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీల హక్కుల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో కేంద్రీకృత పోరాటం నుంచి వికేంద్రీకృత ఉద్యమాల దిశగా వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఎర్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు.







