
Hyderabad:14-11-25:-గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో భార్యాభర్తల మధ్య గొడవ దారుణంతో ముగిసిన ఘటన చోటుచేసుకుంది. రెండు సంవత్సరాల క్రితం గాంధీనగర్‌కు చెందిన సురవి విశాల్ గౌడ్‌కు మల్లాపూర్‌కు చెందిన కావ్యతో వివాహం జరిగింది. ఓ ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న విశాల్, గత కొంతకాలంగా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు.వివాహం అనంతరం నుంచే వీరిద్దరి మధ్య కలహాలు కొనసాగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇటీవల ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైనట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న విశాల్ గౌడ్ సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బలవంతంగా ధ్వంసం చేసి లోపలికి వెళ్లగా, విశాల్ ఉరివేసుకుని కనిపించాడు. అతన్ని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.తమ కుమారుడు విశాల్ ఆత్మహత్యకు కోడలు కావ్య వేధింపులే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. విశాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.







