
హైదరాబాద్ :25-11-25:- గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లాను యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు కేటాయించడం వల్ల బీసీలు తీవ్ర నష్టపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ— బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ప్రస్తుతం 22 శాతం కూడా సక్రమంగా అమలు చేయకపోవడం ఆందోళనకరం అని మండిపడ్డారు.

ప్రభుత్వం విడుదల చేసిన 46వ జీ.ఓ ప్రకారం బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉన్నా, కొన్ని జిల్లాల్లో 10 శాతం కూడా అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.అగ్రకులాల ప్రయోజనాలను కాపాడేందుకే బీసీల రిజర్వేషన్లు తగ్గించారని ఆరోపించిన ఆయన, బీసీలు సర్పంచులు అవడం కూడా కొందరు అగ్రవర్ణాలకు ఇష్టం లేని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. బీసీలు చైతన్యంతో ముందుకు వస్తున్నారని, భవిష్యత్తులో చట్టసభల్లో సరైన రిజర్వేషన్లు సాధించే దిశగా పోరాటం కొనసాగుతుందని కృష్ణయ్య స్పష్టం చేశారు.







