
దేశంలోని ప్రజలందరూ సమాన హక్కులతో జీవించేలా భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని నగరపాలక సంస్థ మేయర్ కోవెలమూడి రవీంద్ర కొనియాడారు. భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక లాడ్జి సెంటర్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నగరపాలక సంస్థ మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు నసీర్ అహ్మద్, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సజీలా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎనలేని సేవలు అందించారన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశంలో జన్మించడం మన అదృష్టమన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారానే దేశంలో అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో అట్టడుగు వర్గాలకు సమానత్వం, అభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంస్కరణలను అమలుపరుస్తూ వారి జీవితాల్లో విద్య, ఉపాధి అవకాశాల మరింతగా మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా దేశంలో ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం అమలు జరుగుతుదన్నారు. అన్ని వర్గాలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వ అధికారులకు కీలకమైన బాధ్యతలు ఉన్నాయన్నారు. శాసనసభ్యులు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితమంతా సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి విలువల కోసం అంకితం చేశారని, రాజ్యాంగ రూపకర్తగా ఆయన చూపిన దూరదృష్టి కారణంగానే దేశంలోని అణగారిన వర్గాలకు హక్కులు, రక్షణ లభించాయని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందిస్తుందన్నారు.నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సజీలా మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా దేశంలో అన్ని వర్గాలు సమానత్వంగా జీవించడంతోపాటు, అభివృద్ధికి, సామాజిక న్యాయానికి మార్గ నిర్దేశంగా దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య, నగరపాలక సంస్థ కార్పొరేటర్ ఈ.వరప్రసాద్, దళిత సంఘాల నాయకులు, నగర ప్రజలు పాల్గొన్నారు.







