
హైదరాబాద్ :14-11-25:-రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించిన ఈ ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ముందుగా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు

.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, సినీ నటులు శర్వానంద్, తేజ సజ్జా, ఆది సాయి కుమార్, యాంకర్ సుమ, డైరెక్టర్ బుచ్చిబాబు, నటుడు బాబు మోహన్ తదితరులు హాజరయ్యారు. పోలీసు శాఖ, రవాణా శాఖ, కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. వివిధ కాలేజీల విద్యార్థులు భారీగా తరలి వచ్చారు.సీపీ సజ్జనార్ మాట్లాడుతూ…రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే వారిని గుర్తుచేసుకునే రోజు ఇది అని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకెళ్తామని చెప్పారు.“3 వేల యాక్సిడెంట్స్, 300 మంది ప్రాణనష్టం… ఇవన్నీ మద్యం సేవించి డ్రైవింగ్, రాంగ్ సైడ్, సిగ్నల్ జంపింగ్ వల్లే జరుగుతున్న ప్రమాదాలు” అని తెలిపారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అవయవాల రవాణా (గ్రీన్ ఛానల్)లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుందని పేర్కొన్నారు.ప్రమాదం జరిగినప్పుడు వెంటనే సహాయం చేసే వారి్ని పోలీసులు గౌరవిస్తున్నామని చెప్పారు.డీజీపీ శివధర్ రెడ్డి సందేశం:రోడ్డు ప్రమాదాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.“మన రాష్ట్రంలో మర్డర్ వల్ల చనిపోతున్న వారి కంటే 15 రెట్లు ఎక్కువమంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు ల్పోతున్నారు” అని గణాంకాలు వెల్లడించారు.ప్రతి ఒక్కరు డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని, కామన్ సెన్స్ పాటించాలని సూచించారు.హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.“ప్రాణం ఒకసారి పోతే తిరిగి రాదు… కుటుంబం రోడ్డుపై పడిపోతుంది” అని అన్నారు.సినీ హీరో శర్వానంద్ వ్యాఖ్యలు:యువత స్పీడ్, రైడర్ స్పిరిట్‌ను కంట్రోల్‌లో ఉంచాలని సూచించారు.“హెల్మెట్, సీట్ బెల్ట్ మన కోసం పెట్టిన రూల్స్…” అని చెప్పారు.ప్రమాదం జరిగినప్పుడు బాధితుడికి తక్షణ సాయం చేసే వారే రియల్ హీరోలని అన్నారు.నటుడు బాబు మోహన్ హృదయవిదారక అనుభవం:చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలన్న కోరిక సినిమాల ద్వారా నెరవేరిందని అన్నారు.

యువత సినిమాల్లోలాగే స్టంట్లు చేయకుండా బాధ్యతగా డ్రైవ్ చేయాలని సూచించారు.తన కుమారుడు బైక్ ప్రమాదంలో మరణించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.కోట శ్రీనివాస్ కుమారుడూ ఇలాటి ప్రమాదంలో మృతి చెందాడని, ఇద్దరూ ఈ దుర్భాగ్యంపై తరచూ ముచ్చటించుకునేవారని చెప్పారు.రోడ్డు ప్రమాదాలు తగ్గించటమే లక్ష్యంగా పోలీసు శాఖ, రవాణా శాఖ, విద్యాసంస్థలు, సినీ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి చేపట్టిన ఈ కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో విజయవంతంగా ముగిసింది
.







