
హైదరాబాద్ నాంపల్లి ప్యాప్సి భవన్‌లో పురాతన వస్తువుల అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది. ఫిలాటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ నిర్వహిస్తున్న “హైపెక్స్ 2025” ఎగ్జిబిషన్‌ను హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ జీఎం శ్రీపాద రామదాస్, సొసైటీ ప్రతినిధులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.

వందేళ్ల చరిత్రను ప్రతిబింబించే స్టాంపులు, పాత కరెన్సీ నోట్లు, నాణేలు, అరుదైన పురాతన వస్తువులు—మొత్తం ఒకేచోట అందుబాటులో ఉండటంతో సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు, యువతకు చరిత్రపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని సొసైటీ కార్యదర్శి సాగి శ్రీనివాసరాజు చెప్పారు.

1962లో స్థాపితమైన ఈ సంస్థ దేశంలోని ప్రముఖ సేకరణాభిమానులను ఒకే వేదికపైకి తీసుకువస్తోందని తెలిపారు. కాకతీయుల నుంచి శ్రీకృష్ణదేవరాయల వరకు… నిజాం కాలం వరకు వివిధ రాజవంశాల నాణాలు, స్టాంపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన 60 స్టాళ్లు ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశారు.మూడురోజుల పాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్‌లో సందర్శకులు కేవలం వీక్షించడమే కాకుండా… తమకు నచ్చిన వింటేజ్ ఐటెమ్స్‌ను కొనుగోలు చేసుకునే అవకాశమూ ఉంది. ఎన్నో ఏళ్ల పురాతన చరిత్రను చెబుతున్న అరుదైన వస్తువులు చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు.







