
హైదరాబాద్: లక్డికపుల్:-మహిళల సమస్యలకు వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యంతో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘నారి న్యాయ్’ కార్యక్రమాన్ని లక్డికపుల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ళ శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాధిత మహిళల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించారు.

ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కధీరవన్ పాలనీ, షీటీమ్ డీసీపీ లావణ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు హాజరయ్యారు. బాధిత మహిళల సమస్యలను చైర్‌పర్సన్ నేరెళ్ళ శారద స్వయంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై నేరెళ్ళ శారద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు సత్వర న్యాయం చేయడంలో ఎలాంటి అలసత్వం సహించబోమని స్పష్టం చేస్తూ, బాధ్యతగా వ్యవహరించని అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళలకు అండగా నిలిచేందుకే ‘నారి న్యాయ్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందో లేదో అనే సందేహం మహిళల్లో ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో వారికి ధైర్యం ఇచ్చేలా మహిళా కమిషన్ పనిచేస్తుందన్నారు.Hyderabad Local News అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘నారి న్యాయ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
బాధితుల్లో ఎక్కువగా మైనార్టీ మహిళలే ఉన్నారని, ముఖ్యంగా రెండో పెళ్లి, కట్న వేధింపుల కేసులు అధికంగా వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు తప్పనిసరిగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని నేరెళ్ళ శారద స్పష్టం చేశారు.










