
Hyderabad:నాంపల్లి :- రాష్ట్రంలో నిలకడగా కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకునేలా స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు. రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలతో పాటు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను సేకరించి ప్రభుత్వానికి నివేదికగా అందజేస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నాంపల్లిలోని జన సమితి పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరామ్, రాష్ట్ర జిడిపిలో సుమారు 25 శాతం వాటా కలిగిన రియల్ ఎస్టేట్ రంగాన్ని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఉందన్నారు. ఈ రంగం అభివృద్ధి కోసం సమగ్రమైన, శాస్త్రీయమైన ఆలోచనలతో కూడిన ప్రతిపాదనలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.Hyderabad news
దీనికోసం ప్రత్యేకంగా ఒక సదస్సు నిర్వహించాలని సూచించిన ఆయన, ఆ సదస్సుకు రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రముఖులు, అసోసియేషన్ నాయకులు, బిల్డర్లు, ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి విస్తృత స్థాయి చర్చ నిర్వహించాలని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున చేపట్టి, లక్షల సంఖ్యలో ఉన్న రియల్ ఎస్టేట్ అసోసియేట్స్‌ను ఐక్యం చేసి ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని కోదండరామ్ పిలుపునిచ్చారు.










