
Hyderabad:మేడ్చల్ : కుత్బుల్లాపూర్:29-11-25:-మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర సెంటర్‌లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ ప్రాంతంలో ఉన్న సన్‌రైస్ వాటర్‌వాష్ & వీల్ అలైన్‌మెంట్ టైర్ల షాప్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.సుమారు ఉదయం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడం ప్రారంభించడంతో స్థానికులు భయాందోళన చెందారు. అప్రమత్తమైన చుట్టుపక్కల వారు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సమయోచితంగా స్పందించడం వల్ల మరింత పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.షాప్‌లోని టైర్లు మరియు ఇతర పదార్థాల కారణంగా మంటలు భారీగా ఎగసిపడ్డాయని, ఆస్తి నష్టం వివరాలు ఇంకా అంచనా వేస్తున్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం ఏదీ నమోదు కాలేదు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.







