
హైదరాబాద్, నవంబర్ 5:-బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి లలన్ సింగ్ చేసిన దళిత వ్యతిరేక వ్యాఖ్యలపై మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగానికి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలకు అవమానమని తీవ్రంగా విమర్శించారు.ఈ సందర్భంగా హనుమంతరావు అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, లలన్ సింగ్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళిత వర్గాలను ఓటు హక్కు వినియోగించకుండా చేయాలన్న వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
.“అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కు కల్పించింది. పేదవాడి ఓటు, ధనవంతుడి ఓటు సమానమే. అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో దళితులను ఓటు హక్కు నుండి దూరంగా ఉంచాలని చెప్పడం అనేది అంబేద్కర్ ఆత్మను అవమానించినట్టే,” అని హనుమంతరావు వ్యాఖ్యానించారు.కేంద్రమంత్రి లలన్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి, వివరణ ఇవ్వాల్సిందిగా అంబర్‌పేట్ పోలీస్ అధికారులను ఆయన కోరారు.







