GUNTUR CITY NEWS: ప్రతి ఇంటికీ క్యూ ఆర్ కోడ్ తో కూడిన డిజిటల్ డోర్ నెంబర్లు

Karthik

గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో రానున్నరోజుల్లో ప్రతి ఇంటికీ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ డోర్‌ నెంబర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. గురువారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, నగరంలోని గృహాలకు డిజిటల్ డోర్ నెంబర్ల ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థలు మరియు మునిసిపాలిటీల్లోని ప్రతి ఇంటికీ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ డోర్‌ నెంబర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, దీనికి సంబంధించిన చర్యలను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు. అందులో భాగంగా అధికారులకు, సచివాలయ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. శిక్షణలో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జిఐఎస్‌) ఆధారంగా అన్ని ఇళ్లను మ్యాపింగ్‌ చేసి అందుకు సంబంధించిన వివరాలన్నింటినీ దీనికి అనుసంధానం చేయడం, ఈ-మున్సిపల్‌ ఈఆర్‌పీ ద్వారా అన్నిఇళ్ల డేటాను సేకరించడం, తనిఖీ చేయడం వంటి అంశాలపై పట్టణ ప్రణాళిక అధికారులు మరియు సిబ్బందికి శిక్షణ అందిస్తున్నారన్నారు. శిక్షణ పొందినవారంతా నగరంలోని ప్రతి ఇంటికి మరియు వ్యాపార సముదాయానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పక్కాగా వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. క్యూఆర్‌ కోడ్‌ డిజిటల్‌ డోర్‌ నెంబరు వ్యవస్థ పూర్తిగా అమలులోకి వస్తే సంబంధిత ఇళ్ల యజమానులకు, వ్యాపారస్తులకు చాలా ఉపయోగాకరంగా ఉంటుందని, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే ఆ ఇంటికి సంబంధించి సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందిన వారు నగరంలోని గృహాలకు డిజిటల్ నెంబర్ల ఏర్పాటు పై ఏమైనా సందేహాలు ఉంటె వెంటనే అడిగి సందేహాలు తీర్చుకోవాలని, వివరాల సేకరణలో ఎటువంటి తప్పులు లేకుండా చేయాలన్నారు. అనంతరం పట్టణ ప్రణాళిక విభాగ రోజువారీ పనిపై సమీక్షిస్తూ, అధికారులు, కార్యదర్శులు తమ డివిజన్లలోని రోడ్లపై భవన నిర్మాణ సామాగ్రి లేకుండా చూడాలని, ఎవరైనా సామాగ్రి వేసినట్లయితే, సీజ్ చేసి, వారికి అపరాధరుసుము విధించాలన్నారు. అలాగే నగరాన్నిపోస్టర్ ఫ్రీ సిటీగా ఉంచాలని, జంక్షన్లలో డివైడర్లపై బ్యానర్లు లేకుండా, అనధికార భవనాల నిర్మాణాలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో డిప్యూటీ సిటీ ప్లానర్ సూరజ్ కుమార్, మాస్టర్ ట్రైనర్లు, టిపిబిఓలు, స్వర్ణ వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review