GUNTUR DISTRICT NEWS: జిల్లాలో ఖరీఫ్ – 2026కు సిద్ధం

Karthik

జిల్లాలో ఖరీఫ్ 2026కు సిద్ధంగా ఉన్నామని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ జిల్లాలో జూన్ రెండవ వారంలో ప్రారంభం కానుందన్నారు. ఈ సంవత్సరం “ఎల్ నినో” వల్ల వర్షపాతం కొంత తగవచ్చని అంచనా ఉందని, అయితే ప్రస్తుతానికి పరిస్థితులు సాధారణంగా ఉందని చెప్పారు. 2025 – 26 ఖరీఫ్ లో విస్తారంగా కురిసిన వర్షాలు, పుష్కలంగా కాలువల ద్వారా నీటి లభ్యత కారణంగా రికార్డు స్థాయిలో 96,192 హెక్టార్లలో వ్యవసాయ పంటలు సాగు కాగా వరి 66,103 హెక్టార్లలో సాగు చేయడం జరిగిందని వివరించారు. ఖరీఫ్ 2024 సీజన్ కంటే 9,314 హెక్టార్లు అధికమన్నారు. ఇప్పటికీ కృష్ణా నదిలో సరిపడ నీటి లభ్యత దృష్ట్యా జులై మొదటి వారంలో పంట సాగుకు నీరు అందించడానికి రాష్ట్ర  ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించిందని, ప్రభుత్వ ఆదేశాల దృష్ట్యా జిల్లాకు ఖరీఫ్ కు 18,600 క్వింటాళ్ళు వరి విత్తనాలు అవసరంకాగా, ఏపి సీడ్స్ (APSEEDs), ప్రైవేట్ సంస్థల ద్వారా ఖరీఫ్ కు కావలసిన వరి విత్తనాలు జూన్ మొదటి వారంలోనే రైతులకు అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. జిల్లాకు 1.5 లక్షల బి.టి ప్రత్తి విత్తన సంచులు అవసరం కాగా, ఇప్పటికే జిల్లాకు కావలసిన విత్తనాలు అందుబాటులోకి తేవడం జరిగిందని చెప్పారు. నాణ్యమైన విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉండేలా జిల్లాలోని అన్ని విత్తన ఉత్పత్తి కేంద్రాల తనిఖీలు ఇప్పటికే పూర్తి చేశామని పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా నమూనాల సేకరణ జులై మొదటి వారానికి పూర్తి చేసే విధంగా వ్యవసాయ అధికారులు విత్తన నమూనాలు తీయడం జరుగుతుందని తెలిపారు. భూసారం పెంచడానికి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం పచ్చిరొట్ట పంట విత్తనాలు పంపిణీ ప్రారంభించ 1,639 క్వింటాళ్ళు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులోకి తేవడం జరిగిందని వివరించారు. పి.యమ్.డి.ఎస్ ( ఋతు పవనాలకు ముందుగా పొడిదుక్కి సాగు విధానం) విధానంలో జిల్లాలో 18,637 విత్తన సంచులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విధానంలో నాటిన పంటను ఫలసాయం కొరకు, ఋతు పవనాలు ఆశాజనకంగా ఉన్నచోట్ల పచ్చి రొట్ట పంటగా కూడా మార్చడం జరుగుతుందన్నారు. ఖరీఫ్ 2026కు జిల్లాకు 57 వేల టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరం కాగా ఇప్పటికే జిల్లాలో 63 శాతం ఎరువులు – 12,588 టన్నుల యూరియా, 4,931 టన్నుల డి. ఏ. పి.,16,207 టన్నుల కాంప్లెక్స్, 1,180 టన్నుల పొటాష్, 1,464 టన్నుల సూపర్ పాస్పేట్  వెరసి 36,371 టన్నుల ఎరువులు నిల్వ చేయడం జరిగిందని చెప్పారు. గత సంవత్సర అనుభవం దృష్ట్యా ఎరువుల పంపిణీ కార్డులు మే నెలాఖరు లోగా రైతు సేవ కేంద్రాల ద్వారా వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆద్వర్యంలో పంట సాగుచేసే రైతులకు ఇవ్వటానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎరువుల పంపిణీ కార్డ్ ద్వారా రైతులు జిల్లాలో తాము వేసిన పంటకు ఎంత యూరియా, డి.ఏ.పి ఎరువులు అవసరమో ముందుగానే సూచించి పంట వేసిన రోజు నుండి మూడు దఫాలుగా అందించడం జరుగుతుందన్నారు.  కౌలుదారులకు కూడా ఎరువుల పంపిణీ కార్డులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. జిల్లాకు ఇప్పటికే వ్యవసాయ యంత్ర పరికరాల నిమిత్తం రూ.3.04 కోట్ల మజూరు కాగా, రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఖరీఫ్ ఆరంభంలోగా పరికరాల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కౌలు రైతుల గుర్తింపు కార్డుల జారీ కూడా రైతు సేవ కేంద్రాలలో జరుగుతుందని, ఆత్మ (ఏ.టి.ఎం.ఏ) ద్వారా సమతుల్య ఎరువుల వాడకం, “ఎల్ నినో” పరిస్థితులలో చేయపట్టదగిన సాగు విధానాలపై శిక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఖరీఫ్ 2026 సాగుకు కావలసిన విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, వ్యవసాయ రుణాలు, నీటి పారుదల కాలువల మరమ్మతులు, సమయోచిత సాంకేతిక సూచనలు, నూతన సాగు విధానాలపై అవగాహన కార్యక్రమాల ప్రాణాళికలతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ ఖరీఫ్ 2026 కు ప్రణాళికా బద్దంగా సంసిద్ధతతో ముందుగు సాగుతోందని వివరించారు.    

Author
Share This Article
Leave a review