వల్లపు చెరువు అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి

City News Telugu

పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట, జూలై 7:పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన వల్లపు చెరువును ఆధునిక వసతులతో అభివృద్ధి చేసేందుకు చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. మంగళవారం ఆయన వల్లపు చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రధానమంత్రి కృషి యోజన (PMKSY) 2.0 పథకం కింద రూ.1.30 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టగా, తొలి విడతగా రూ.50 లక్షల నిధులు విడుదలై పనులు ప్రారంభ దశలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అధికారులు పనుల పురోగతిని ఎమ్మెల్యేకు వివరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, చారిత్రక ప్రాధాన్యత కలిగిన వల్లపు చెరువును పట్టణానికి ఆదర్శవంతమైన మోడల్ ట్యాంక్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చెరువు అభివృద్ధి ద్వారా తాగునీటి భద్రత, భూగర్భ జలాల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం చెరువులో పూడికతీత, ట్యాంక్‌బండ్ బలోపేతం, రిటైనింగ్ వాల్ నిర్మాణం, పరిసర ప్రాంతాల శుభ్రత వంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. తదుపరి దశలో వాకింగ్ ట్రాక్, మొక్కల పెంపకం, సోలార్ లైటింగ్, బెంచీలు, చిన్నారుల కోసం పార్క్, బోటింగ్ సౌకర్యం వంటి ఆధునిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే చెరువు మధ్యలో శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ నిధులతో పాటు ఎన్ఆర్ఐల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. 2027లో జరిగే గంగమ్మ తల్లి తిరునాళ్ల నాటికి వల్లపు చెరువుకు సరికొత్త రూపును తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గుడి కమిటీ చైర్మన్ పాండురంగారావు, నరసరావుపేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నాగసారపు సుబ్బరాయగుప్తా, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a review