GUNTUR CITY NEWS: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పిస్తాం

Karthik

స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చే తీర్పుతో వైసీపీ కనుమరుగు అవ్వాలని, బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో వైఎస్సార్‌సీపీ అనుసరించిన వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు ఏటీ అగ్రహారం మెయిన్‌ రోడ్డులోని వాటర్‌ ట్యాంకుల వద్ద ఓ ఫంక్షన్‌ హాలులో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం పై ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషిని వివరించడంతోపాటు, ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ వైఖరిని ఎండగడుతూ సమావేశంలో చర్చించారు.*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ..* బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం, నాయకత్వ అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని తొలుత గుర్తించిన పార్టీ తెలుగుదేశమని పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు రాజకీయాల్లో ఎదిగి నాయకులుగా మారినప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. తొలుత 20 శాతంగా ఉన్న రిజర్వేషన్లను క్రమంగా పెంచుకుంటూ వచ్చారని, ప్రస్తుతం 34 శాతం రిజర్వేషన్ల దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. బీసీలకు నాయకత్వ అవకాశాలు కల్పించిన ఘనత టీడీపీదే**బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా, నాయకత్వ బాధ్యతలు చేపట్టే స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని, ఎన్టీఆర్‌ కులాల మధ్య విభజన రాజకీయాలకు భిన్నంగా సామాజిక సమానత్వానికి ప్రాధాన్యమిచ్చారని, చంద్రబాబు నాయుడు సైతం బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి చెప్పారు. యువతకు, వెనుకబడిన వర్గాలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా అనేక మంది నాయకులను తయారు చేసిన రాజకీయ వేదికగా టీడీపీ నిలిచిందన్నారు. రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీని ప్రశ్నించిన ఎమ్మెల్యే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తోందని మాధవి తెలిపారు. సుప్రీంకోర్టులో 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు ఉన్నప్పటికీ, బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన పరిస్థితులను ప్రస్తావిస్తూ, ఆయా రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలు, వాటి వెనుక ఉన్న న్యాయపరమైన కారణాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జనగణన, సామాజిక వెనుకబాటుతనానికి సంబంధించిన గణాంకాలు, న్యాయపరమైన అంశాలు రిజర్వేషన్ల నిర్ణయాల్లో కీలకమని పేర్కొన్నారు.గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై వైఎస్సార్‌సీపీ అనుసరించిన వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి పైగా సీట్లు కేటాయించేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉందా అని నిలదీశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంపై మాటలకు, ఆచరణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు.**పదవుల కోసం కాదు.. బీసీల రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ప్రతి ఒక్కరికీ ఒకేసారి పదవులు రావడం సాధ్యం కాదని, అవకాశాలు వచ్చిన వారిని గెలిపించడం కూడా నాయకత్వంలో భాగమేనని మాధవి అన్నారు. ఎన్నికల్లో గెలిచిన వారే నాయకులు కాదని, ఇతరులను ముందుకు తీసుకెళ్లి విజయానికి తోడ్పడేవారు కూడా నాయకులేనని చెప్పారు. పార్టీ కోసం, నాయకత్వం కోసం, ప్రజాసేవ కోసం నిలబడిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం తనకు ఉందన్నారు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానికంగా బలమైన నాయకత్వం ఉండటం, విభేదాలు వచ్చినా చర్చల ద్వారా పరిష్కరించుకునే సామర్థ్యం ఉండటం నియోజకవర్గ ప్రత్యేకతగా అభివర్ణించారు. ఈ ఐక్యతను కాపాడుకుంటూ రానున్న ఎన్నికల్లో సమష్టి కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం బలహీన వర్గాల అభ్యున్నతి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. కూటమి పార్టీల సమన్వయంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించే విషయంలో కూటమి నాయకత్వంపై విశ్వాసం ఉంచాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై నాయకత్వం తగిన కసరత్తు చేస్తుందని, బీసీ వర్గాల అభ్యున్నతికి అందరూ సహకరించాలని అన్నారు.రానున్న ఎన్నికల్లో బీసీలు ఐక్యంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి రాజకీయంగా స్థానం లేకుండా చేసే దిశగా కూటమి శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తాళ్ళ వెంకటేష్ యాదవ్, నిమ్మల శేషయ్య, తుమ్మల నాగేశ్వరరావు, గాలం వెంకటేశ్వర్లు, అడకా శ్రీనివాస్, బత్తుల జాన్ సైద, చంద్రగిరి బాబు, పేరయ్య, సంజీవ్, ఉప్పతల సాంబ మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review