పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగనుంది. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై జరిగిన చర్చ… ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై ఫోకస్ పెడుతున్న క్రమంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆ రంగానికి హై ప్రయార్టీ ఇస్తోంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో రెన్యూవబుల్ రంగంలో భారీ పెట్టుబడులతో ఎనర్జీ ప్లాంట్ స్థాపించేందుకు ప్రముఖ రెన్యూ ఎనర్జ్ గ్లోబల్ సంస్థ ముందుకొచ్చింది. క్లీన్ ఎనర్జీ రంగంలోని ప్రధాన సంస్థల్లో ఒకటిగా ఉన్న రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఇప్పటికే దేశంలో 19.2 గిగావాట్ల సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో క్లీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసి… ప్రముఖ స్థానంలో ఉంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ 6 గిగా వాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీంట్లో భాగంగా ఆ ప్లాంట్‌కు భూమి పూజ గురువారం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. మొత్తంగా రూ.5,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయబోయే సంస్థకు భూమి పూజ చేపట్టడంతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి కీలక అడుగులు పడనున్నాయి. డీకార్బనైజేషన్ రంగంలో ముందంజలో ఉన్న ఈ సంస్థ.. సుమారు రూ.4,200 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఇంగాట్–వేఫర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. దీంతో పాటు మరో రూ.1,200 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ఈ రెండు ప్రాజెక్టులు వచ్చే రెండేళ్లలో పూర్తి కానున్నాయి.



