రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా… రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని… ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం అన్నారు. అలాగే 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రైతులు ప్రకృతి సాగు కింద చేసే ఉత్పత్తులను సర్టిఫికేషన్‌తో విక్రయించేలా చర్యలు చేపట్టాలని, దీంతో ఆయా ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని అధికారులతో సీఎం చెప్పారు. రాష్ట్రంలో గతేడాది రబీలో హెక్టారుకు యూరియా వినియోగం తగ్గడం శుభపరిణామమని అన్నారు. రైతు బజార్ల నుంచి డోర్ డెలివరీ చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని, దీని కోసం ఏదైనా ఏజెన్సీ సేవలు వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా చేసేందుకు క్లస్టర్ల వారీగా అభివృద్ధి కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా కోకో పంటకు సంబంధించి ‘కోకో సిటీ’ ఏర్పాటు చేస్తున్నామని… కోకో సిటీ ఔత్సాహిక రైతులకు ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. 250 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఆదేశించారు.



