నరసరావుపేట (పల్నాడు జిల్లా):-ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయిన దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘ప్రాణదానం ట్రస్ట్’ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరెంటు షాకులు, రహదారి ప్రమాదాలు మరియు కర్మాగారాల్లో జరిగే ప్రమాదాల వల్ల చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా ఆధునిక కృత్రిమ చేతులు అమర్చనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్ల వెల్లడించారు.
లక్షల రూపాయల విలువైన, బ్యాటరీతో పనిచేసే దాదాపు 200 ఆధునిక కృత్రిమ చేతులను పూర్తి ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల (ఆగస్టు) 6, 7 తేదీలలో నరసరావుపేటలోని రాధా సుందర్ కళ్యాణ మండపంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రాణదానం ట్రస్ట్ గౌరవ సలహాదారు కె.పి. రంగారావు మాట్లాడుతూ.. చేతులు కోల్పోయి జీవనోపాధి కష్టంగా మారిన వారికి ఈ కృత్రిమ చేతులు నూతన ఆశలను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ సేవా కార్యక్రమాన్ని బాధితులకు ఉచితంగా అందిస్తున్నామని స్పష్టం చేశారు.
సంప్రదించాల్సిన వివరాలు:
ఈ సౌకర్యం కావలసిన బాధితులు నరసరావుపేటలోని ప్రాణదానం ట్రస్ట్ ప్రతినిధులను 70134 63637 ఫోన్ నంబర్లో సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.



