ప్రమాదానికి గురై, రైలింగ్ దెబ్బతిని, ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితిలో ఉన్న చేబ్రోలు బ్రిడ్జిని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌తో కలిసి బ్రిడ్జి పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు.ఇటీవల జరిగిన లారీ ప్రమాదం కారణంగా బ్రిడ్జి రైలింగ్ దెబ్బతినడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని మంత్రి పరిశీలించారు. బ్రిడ్జి వద్ద ఉన్న ప్రమాదకర పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బ్రిడ్జికి అవసరమైన మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయిస్తామని మంత్రి పెమ్మసాని తెలిపారు. అలాగే, దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడేలా నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలకు తావులేని విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. చేబ్రోలు బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



