GUNTUR DISTRICT NEWS: విలువలతో కూడిన సమాజం నెలకొల్పడమే ధ్యేయం కావాలి

Karthik

విలువలతో కూడిన సమాజం నెలకొల్పడమే ధ్యేయం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.  డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురుపూజోత్సవ దినోత్సవం – 2026 కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గల ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలు అందించాలన్నారు. ఇది సమాజానికి గొప్ప పెట్టుబడి కాగలదని పేర్కొన్నారు. విలువలు అనే పునాదిపై సమాజాన్ని నిర్మించాలని కోరారు. ఇది ఉపాధ్యాయుల చేతిలో ఉందని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలలో ఉంటారని, వారిని చక్కగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. మంచి నాయకత్వ లక్షణాలు అందించాలన్నారు. విద్యార్థులు అనుకున్నది సాధించే వరకు కృషి చేసే విధంగా ప్రేరణ కల్పించాలన్నారు. ఒత్తిడిని తట్టుకునే శక్తి కలిగి ఉండే విధంగా విద్యార్థిని తయారు చేయాలని సూచించారు. ఓటమిని తట్టుకుని నిలబడే శక్తిని కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులనుఆశయాలకు దగ్గర చేయగలగాలన్నారు.  మహాత్మా గాంధీ యావత్తు దేశాన్ని మమేకం చేశారన్నారు. భావితరాలకు ఏం కావాలో ఆలోచించండి .. అందుకు అవసరమైన మెట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఆచార్యుడిగా, గొప్ప ఫిలాసఫర్ గా నిలిచారని, అందుకు రాధాకృష్ణన్ అనుసరించిన విలువలు, ఆచరణ మాత్రమేనని అన్నారు. విద్యార్థులు సాధించిన దానిని తానే సాధించినట్లు గురువు భావిస్తే గొప్ప విషయాలకు శ్రీకారం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులుగా ఎంతో మందికి బోధన చేశారు… ఎంతో మందికి మార్గదర్శకత్వం చేశారని చెప్ప గలిగితే … దానికి సరితూగేది ఏదీ లేదన్నారు. ప్రతి అడుగులో గురువు చూపే దారి గొప్పదన్నారు. విద్యార్థులు ఏమి సాధించాలి అని మార్గదర్శకత్వం వహించేది గురువేనన్నారు. గురువు స్థానంలో ఉన్న మీపై ఎక్కువ బాధ్యత ఉందన్నారు. శ్రద్ధతో ఇష్టంతో విద్యా బోధన చేయడంతో పదవ తరగతి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు, కష్టపడి పనిచేసే వారు  ఉన్నారని కితాబు ఇచ్చారు. అయితే మార్కులు వరకే పరిమితం కాకూడదన్నారు. ప్రస్తుతం సాంకేతిక విప్లవంతో సమాచారం అందుబాటులో ఉందని, కానీ విద్యార్థులకు విశ్లేషణ చేసే శక్తి అవసరం అన్నారు. విశ్లేషణ శక్తి కల్పించాలని సూచించారు. విద్యార్థులను గమనించాలని, వారికి అవసరమగు నైపుణ్యం అందించాలని, జీవితంలో చక్కగా స్థిర పడటమే కాకుండా సమాజానికి విలువైన సంపదగా తయారు చేయాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ భీమనేని వందనా దేవి మాట్లాడుతూ సమాజానికి అత్యుత్తమ అత్యున్నత, పౌరులను అందించాలన్నారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడుగా పేరెన్నిక గన్నారన్నారు. గురువు లేనిదే రాణింపు లేదన్నారు. ఏ రంగంలో ఉన్న వ్యక్తినైనా ఉపాధ్యాయుడే తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఆదర్శప్రాయులన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న పవిత్రమైన వృత్తిలో ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి గొప్పదని చెప్పారు. వివిధ విద్యా సంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సర్వ శిక్షా అభియాన్ ఎపిసి పద్మావతి, ఉప విద్యా శాఖ అధికారులు  ఏసు రత్నం, శాంత కుమారి., మండల విద్యా శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review