NTR Distric news :యువతకు ఆకాశమే హద్దు… కేబీఎన్‌లో ఎయిర్ వింగ్ ఎన్‌సీసీ ఆరంభం

Sharat
1 View

విజయవాడ పశ్చిమ :– విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తుందని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ కె.వి. శ్రీనివాస్ అన్నారు. నగరంలోని ప్రతిష్టాత్మక కేబీఎన్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిర్ వింగ్ ఎన్‌సీసీ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఘనంగా ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రూప్ కెప్టెన్ కె.వి. శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర విద్యారంగంలో విశిష్ట గుర్తింపు పొందిన కేబీఎన్ కళాశాలలో ఎయిర్ వింగ్ సేవలు ప్రారంభం కావడం ఎన్‌సీసీ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఎన్‌సీసీ శిక్షణ విద్యార్థులను కేవలం క్యాడెట్లుగానే కాకుండా బాధ్యతగల పౌరులుగా, సమర్థ నాయకులుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. సమయపాలన, ఆత్మవిశ్వాసం, నిర్ణయాత్మకత, జాతీయ చైతన్యం వంటి విలువలు విద్యార్థుల జీవితాంతం తోడ్పడతాయని పేర్కొన్నారు.

కేబీఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ తూనికుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలు, బాధ్యతలు, సామాజిక స్పృహను పెంపొందించడం తమ విద్యాసంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధి అవకాశాల కల్పనలో కేబీఎన్ కళాశాల రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ప్రతి విద్యార్థి ఉద్యోగం పొందేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్‌లతో త్రివిధ దళాల ఎన్‌సీసీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.

ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి. నారాయణరావు మాట్లాడుతూ, తమ విద్యాసంస్థలోని ఆర్మీ ఎన్‌సీసీ విభాగం ద్వారా అనేక మంది విద్యార్థులు జాతీయ స్థాయి శిబిరాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారని తెలిపారు. రిపబ్లిక్ డే పరేడ్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై కూడా తమ క్యాడెట్లు సంస్థ ప్రతిష్టను చాటారని పేర్కొన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ, ఎయిర్ వింగ్ ఎన్‌సీసీ ప్రారంభం కళాశాల చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. దేశసేవకు అంకితభావంతో ముందుకు సాగే యువతను తీర్చిదిద్దే అవకాశాన్ని ఎన్‌సీసీ కల్పిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం. వెంకటేశ్వరరావు, డాక్టర్ కె. రామకృష్ణ, పి.ఎల్. రమేష్, ఆర్మీ వింగ్ ఎన్‌సీసీ అధికారి మేజర్ కెప్టెన్ విజయభాస్కర్, ఎయిర్ వింగ్ కేర్‌టేకర్ ఏ. విష్ణు ప్రకాష్, ఫ్లైట్ లెఫ్ట్నెంట్ సూరజ్ సింగ్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ రోషన్ ప్రభాత్, జీసీఐ హారిక, పీఐ స్టాఫ్ సభ్యులు, క్యాడెట్లు పాల్గొన్నారు.

  1. కేబీఎన్ కళాశాలలో ఎయిర్ వింగ్ ఎన్‌సీసీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న గ్రూప్ కెప్టెన్ కె.వి. శ్రీనివాస్.
  2. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గ్రూప్ కెప్టెన్ కె.వి. శ్రీనివాస్.
Author
Share This Article
Leave a review