గుంటూరు:– గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన కోవెలమూడి లక్ష్మీ అపర్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఎంపిక ప్రజాస్వామ్యబద్ధమైన నిర్ణయమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బీజేపీ సహకారంతో పాటు రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీల సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా రాష్ట్రానికి అదనపు నిధులు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.Guntur City News
గుంటూరు నగర మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మీ అపర్ణను ఎంపిక చేయడం సంతోషకరమని, ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
గత 15 సంవత్సరాలుగా గుంటూరు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ కష్టపడి పనిచేసిన నాని సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పార్టీ నాయకత్వం అభిప్రాయాలతో పాటు ఐవీఆర్ఎస్ విధానం ద్వారా కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి పరిగణనలోకి తీసుకోవడం టీడీపీలో కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు.
పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు అనుగుణంగానే మేయర్ అభ్యర్థి ఎంపిక జరిగిందని, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం ఈ నిర్ణయంపై సానుకూలంగా ఉన్నారని తెలిపారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవడమే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో కూటమి పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయిందని, మిగిలిన అంశాలను సంబంధిత ఎమ్మెల్యేలు చర్చించి త్వరలోనే ఖరారు చేస్తారని చెప్పారు. గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
అభ్యర్థి ఎంపికకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో పాటు ఐవీఆర్ఎస్ సహా వివిధ మార్గాల్లో తమ అభిప్రాయాలను తెలియజేసిన పార్టీ కార్యకర్తలకు పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, బి. రామాంజనేయులు, టీడీపీ నాయకులు తాడిశెట్టి మురళి, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, జనసేన నాయకుడు కిలారి రోశయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



