GUNTUR DISTRICT NEWS: ఎంపీటీసీ, జడ్పిటిసి నామినేషన్లకు నోటిఫికేషన్ జారీ

Karthik

ఎంపీటీసీ, జడ్పిటిసి నామినేషన్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్.ఇ.సి) నోటిఫికేషన్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పిటిసిలకు 21 నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, 24న స్క్రూటినీ, 25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు, 26న అప్పీల్లెట్ అధికారి అప్పీల్ పరిష్కారం, 27న ఉపసంహరణలు, నవంబరు 3న పోలింగ్, నవంబరు 5న ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఎస్.ఎస్.టి, ఎఫ్.ఎస్.టి బృందాలు 50 చొప్పున నియమించామని తెలిపారు. జిల్లాలో సున్నిత, అతిసున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని వివరించారు. జిల్లాలో గుంటూరు నగర పాలక సంస్థకు, తెనాలి పురపాలక సంఘానికి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. రిటర్నింగ్ అధికారులు ప్రతీ నామినేషన్ ను పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఒక చెక్ లిస్టు పెట్టుకోవాలని ఆదేశించామని అన్నారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నిరభ్యంతర పత్రాలు (ఎన్.ఓ.సి) ఎప్పటికప్పుడు జారీ చేయుటకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ఒకే రోజు పదకొండు వందల దరఖాస్తులు ఎన్.ఓ.సి కొరకు రాగా వాటిని కూడా రాత్రికి రాత్రే జారీ చేశామని వివరించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా, సజావుగా జరుగుటకు ఇదే సహకారాన్ని చివరి వరకు అందించాలని కోరారు. ఎటువంటి సమస్యలు, సందేహాలు ఉన్న వెంటనే తమ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సైతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించినా, ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా, వాటిపై ఫిర్యాదులు చేసేందుకు లేదా వివరాలు తెలుసుకునేందుకు 08632 234014 హెల్ప్‌డెస్క్/కాల్ సెంటర్ ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చని చెప్పారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి మాట్లాడుతూ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల ఎన్నికకు ఉపాధ్యాయులు నవంబరు 6వ తేదీ లోగా ఓటర్లుగా నమోదు కావాలని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో పట్టణ ఎన్నికల వరకు ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగిందని, అధికారులు చక్కటి సమన్వయం చేస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, కాంగ్రెసు పార్టీ ప్రతినిధి బోట్ల బ్రహ్మయ్య, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కంచర్ల శివరామయ్య, ఎన్.ఓంకార్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డా.టి.సేవ కుమార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి చిరతన గండ్ల వాసు, సి.పి.యం ప్రతినిధి బి. ముత్యాల రావు, వైఎస్ఆర్సిపి ప్రతినిధి వై పిచ్చి రెడ్డి, జన సేన పార్టీ ప్రతినిధి త్రినాథ్, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి వై వి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review