Tenali City News :తెనాలి అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి-కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్– ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఎన్నికల ప్రచారం

S Sarath
1 View

తెనాలి:- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెనాలి పట్టణంలో కూటమి ప్రభుత్వం బలపరిచిన మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు.

తెనాలిలోని శివాజీ చౌక్ నుంచి గాంధీ బొమ్మల సెంటర్, మార్కెట్ ఏరియా మీదుగా మున్సిపల్ భవనం వరకు ప్రచార కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల సమయంలో తెనాలి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధికి కృషి జరుగుతోందని తెలిపారు. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లైనా నిధులు తీసుకొచ్చి తెనాలిని అభివృద్ధి చేస్తారని గతంలో చెప్పానని, ఆ దిశగా మనోహర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

గతంలో తెనాలి-మంగళగిరి మధ్య రహదారి దుస్థితిలో ఉండేదని, ప్రస్తుతం ఆ రహదారిని అద్భుతంగా తీర్చిదిద్దడంలో మనోహర్ కృషి ఉందన్నారు. పట్టణంలోని ప్రతి వీధిలో రహదారుల నిర్మాణం, డ్రైనేజీల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు. తెనాలి మున్సిపల్ భవనాన్ని సైతం పీపీపీ విధానంలో ఆధునికంగా నిర్మించే పనులు జరుగుతున్నాయని తెలిపారు.Guntur City News

పట్టణ అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే స్థానిక ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని పెమ్మసాని కోరారు. ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి పనుల విషయంలో సమన్వయ లోపం ఏర్పడే అవకాశం ఉందని, రాజకీయ విమర్శలు, ఆరోపణలకే సమయం వృథా అయ్యే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేసే అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టణానికి మరిన్ని నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజల ఓటు వృథా కాకుండా కూటమి బలపరిచిన అభ్యర్థులకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.

తెనాలి అభివృద్ధికి కూటమికి మద్దతివ్వాలి

తెనాలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తోటకూర వెంకట రామారావు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు తెనాలి పట్టణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. గత పాలనలో సంక్షేమం పేరుతో ప్రజలను మభ్యపెట్టారే తప్ప ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో వేల కోట్ల రూపాయల నిధులతో తెనాలి పట్టణంతో పాటు గుంటూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని తోటకూర వెంకట రామారావు విజ్ఞప్తి చేశారు.

Author
Share This Article
Leave a review