
జీవితం ఎప్పుడు ఎవరిని ఎలా దెబ్బతీస్తుందో ఎవరూ ఊహించలేరు. రెక్కాడితే గానీ డొక్కాడని ఓ సామాన్య ఆటో డ్రైవర్ కుటుంబాన్ని విధి వంచించింది. తుగ్గలి గ్రామానికి చెందిన వొరుగు రవి, వయస్సు కేవలం 36 ఏళ్లు. ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలను, భార్యను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. ఉన్నంతలో తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, వారిని ప్రయోజకులను చేయాలని కలలు కనేవాడు. కానీ, ఆ కలలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి.
సోమవారం తెల్లవారుజామున రవికి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. రవి తుది శ్వాస విడిచారని తెలియడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రవి మరణంతో భార్య సుజాత దిక్కుతోచని స్థితిలో ఉండగా, మూడో తరగతి చదువుతున్న కుమారుడు జశ్వంత్, కుమార్తె ప్రత్యూష తమ తండ్రి భౌతిక దేహం వద్ద చేస్తున్న రోదనలు మిన్నంటాయి.

“ఆటోలో షికారుకు తీసుకెళ్తావని ఎదురుచూశాం నాన్నా.. మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయావా?” అని ఆ పసిబిడ్డలు అడుగుతున్న ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. రవి మరణంతో తుగ్గలి గ్రామం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. కష్టపడి పనిచేసే వ్యక్తిని కోల్పోవడంతో పాటు, ఇప్పుడు ఆ కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆపన్న హస్తం అందించి, చదువుకుంటున్న ఆ చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని గ్రామస్థులు మరియు బంధువులు కన్నీటితో వేడుకుంటున్నారు.


