అమరావతి:- రాష్ట్రంలోని మారుమూల గ్రామాలు, ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూపొందించిన ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారి సౌకర్యం లేని మరో 158 ఆవాసాలకు తొలిసారిగా రోడ్డు మార్గం అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన పరిపాలనా అనుమతుల ప్రక్రియ పూర్తయింది.
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.422.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో 347 కిలోమీటర్ల పొడవున 146 రోడ్లు, 19 వంతెనలను నిర్మించనున్నారు. నిర్మించిన రహదారుల నిర్వహణ కోసం ఐదేళ్ల కాలానికి మరో రూ.24.47 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు.
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇప్పటికే ‘అడవితల్లి బాట’ పేరుతో గిరిశిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో జనజీవనానికి దూరంగా ఉన్న మారుమూల పల్లెలు, కుగ్రామాలు, ఆవాసాలకు రహదారులను విస్తరించనుంది. ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, కడప, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి అంచనాలు సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారంతో 158 ఆవాసాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. మారుమూల ప్రాంతాల్లో నిర్మించే రహదారుల విషయంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.
తాము నిర్మించే రోడ్లు దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు రోడ్లు, వంతెనలు నిర్మించడం ద్వారా బాహ్య ప్రపంచంతో అనుసంధానం పెరుగుతుందని, తద్వారా ప్రజలకు విద్య, వైద్యం, మార్కెటింగ్ తదితర సదుపాయాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.



