విజయవాడ, ఆగస్టు 21: – రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 629 ఏఈఈ పోస్టులకు సుమారు 1.05 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి తెలిపారు.
రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎండీ వెల్లడించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల ఫేస్ వెరిఫికేషన్‌తో పాటు మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచీలు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలు, కాగితాలు తీసుకురావడాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని సీఎండీ పుల్లారెడ్డి హెచ్చరించారు. నియామక పరీక్షలు, ఫలితాలు, ఇతర అంశాలకు సంబంధించి అధికారికంగా వెలువడే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సూచించారు.



