ఢిల్లీ:– దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్ అవుతోంది. పెన్నుతో వార్తలు రాసేవారితో పాటు వీడియో కెమెరాలతో వార్తా ప్రసారాలు నిర్వహించే వారిని కూడా జర్నలిస్టులుగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
రాజకీయ నాయకులు, అక్రమ సంపాదనకు పాల్పడుతున్న వ్యక్తులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారి వ్యవహారాలను ఆధారాలతో వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టకూడదని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు సమాచారం.
శాటిలైట్ న్యూస్ చానళ్లతో పాటు యూట్యూబ్ న్యూస్ చానళ్లు, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఇదే రక్షణ వర్తిస్తుందని ప్రచారం జరుగుతోంది. జర్నలిస్టులపై నమోదయ్యే కేసులు, వార్తలకు సంబంధించిన వివాదాలను సంబంధిత జర్నలిస్టు సంఘాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే విధంగా మార్గదర్శకాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
అయితే, వైరల్ అవుతున్న ఈ సమాచారానికి సంబంధించి సుప్రీంకోర్టు అధికారిక తీర్పు, కేసు నంబర్ లేదా తీర్పు పూర్తి వివరాలను నిర్ధారించుకోవాల్సి ఉంది. అధికారిక న్యాయపత్రాలు అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



