Hyderabad City news :బీసీ-ఏ వర్గాల హక్కులను విస్మరిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం- బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీసీ-ఏ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్

S Sarath
1 View

హైదరాబాద్ (బషీర్బాగ్):– ముదిరాజ్ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. భాగయ్య, అధ్యక్షుడు గడప శ్రీహరి, ప్రధాన కార్యదర్శి టి. నారాయణ మాట్లాడారు.

అత్యంత వెనుకబడిన (ఎంబీసీ) కులాల హక్కులను విస్మరిస్తూ, కొద్ది కులాలకే ప్రాధాన్యం కల్పించేలా కేంద్ర మంత్రి మాట్లాడడం సముచితం కాదని వారు విమర్శించారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పుట్టుక నుంచి చావు వరకు సమాజానికి సేవలు అందించే చేతివృత్తులు, యాచక వృత్తులపై ఆధారపడిన 36కు పైగా బీసీ-ఏ ఉపకులాల హక్కులను అలసత్వం వహిస్తే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.Hyderabad City news

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తొలగించిన 27 కులాల హక్కుల కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు సుదీర్ఘ న్యాయపోరాటం చేసి సాధించుకున్నామని గుర్తుచేశారు. ఇప్పుడు అధికార అహంకారంతో బీసీ కులాల మధ్య విభజన తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇప్పటికే కరీంనగర్, సిద్దిపేట తదితర జిల్లాల్లో కేంద్రమంత్రికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయని, రాబోయే రోజుల్లో ప్రతి గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేపట్టి పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తామని హెచ్చరించారు.

Author
Share This Article
Leave a review