
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల పోరుబాట మళ్ళీ మొదలైంది. తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న ఫ్యాప్టో (FAPTO), తాజాగా మరో భారీ పోరాటానికి సిద్ధమైంది. విజయవాడ ధర్నా చౌక్ వేదికగా సాగిన నిరాహార దీక్షల ముగింపు సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. సాయి శ్రీనివాస్ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడకపోతే.. జూన్ నెలలో ‘చలో సెక్రటేరియట్’ చేపడతామని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా కొత్త వేతన సవరణ (PRC) అమలు, 30 శాతం మధ్యంతర భృతి (IR) మంజూరు చేయాలని ఫ్యాప్టో డిమాండ్ చేస్తోంది. వీటితో పాటు మున్సిపల్ టీచర్లకు పీఎఫ్ (PF) సౌకర్యం కల్పించాలని, స్థానిక సంస్థల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని వారు స్పష్టం చేస్తున్నారు.
విజయవాడ ధర్నా చౌక్ నిరసన దృశ్యాలు): ఈ సందర్భంగా ఫ్యాప్టో ప్రధాన కార్యదర్శి ఎస్. చిరంజీవి మాట్లాడుతూ.. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు కోసం తాము సుదీర్ఘ పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్చలకు పిలవాలని, లేనిపక్షంలో పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఫ్యాప్టో సీనియర్ నాయకులు జోసెఫ్ సుధీర్ దీక్షా పరులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
జూన్ నెలలో జరగబోయే ‘చలో సెక్రటేరియట్’ ఉద్యమం ప్రభుత్వానికి సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ హెచ్చరికలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కెమెరామెన్ రమేష్‌తో, న్యూస్ డెస్క్.


