సిక్కోలులో ఉపరాష్ట్రపతి సందడి! 🚩 కేంద్ర మంత్రి ఇంటికి CP రాధాకృష్ణన్!

Bhuvana

భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన సోమవారం అత్యంత వైభవంగా మరియు భక్తి శ్రద్ధలతో ముగిసింది. పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తొలుత గార మండలంలోని శ్రీకూర్మ క్షేత్రానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం లభించింది. కూర్మనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆయన అరసవల్లి క్షేత్రానికి చేరుకున్నారు. భాస్కర క్షేత్రంలో సూర్యనారాయణ స్వామిని దర్శించి జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 12.45 గంటలకు శ్రీకాకుళం నగరంలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నివాసానికి ఉపరాష్ట్రపతి చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి రాక దృష్ట్యా నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య, ముందస్తు అనుమతి ఉన్న నేతలను మాత్రమే లోపలికి అనుమతించారు.

ఈ భేటీలో జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పలువురు ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, బెందాళం అశోక్, ఎన్.ఈశ్వరరావు తదితరులు ఉపరాష్ట్రపతిని కలిసి మర్యాదపూర్వక సంభాషణ జరిపారు. మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని, ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. ఉపరాష్ట్రపతి రాకతో శ్రీకాకుళం జిల్లాలో సందడి నెలకొంది.

Author
Total Views: 0
Share This Article
Leave a review