
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో మంటలు కొనసాగుతున్నాయి! పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న వాహనాలు, గంటల తరబడి నిరీక్షణ.. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న దృశ్యం. ఈ క్లిష్ట సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్న పెట్రోల్ బంకులపై పల్నాడు జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించిన మూడు పెట్రోల్ బంకులను సీజ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నరసరావుపేటలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలోని తిరుమల ఫిల్లింగ్ స్టేషన్‌తో పాటు చిలకలూరిపేటలోని జనతా ఫిల్లింగ్ స్టేషన్‌పై వేటు వేశారు. స్టాక్ ఉన్నప్పటికీ లేదని చెప్పడం లేదా అనధికారికంగా ఇంధన అమ్మకాలు సాగించడం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.
ఇంధన కొరతను సాకుగా చూపి ఎవరైనా అధిక ధరలకు విక్రయించినా, లేదా కృత్రిమ కొరత సృష్టించినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ కృతికా శుక్లా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులను పౌరసరఫరాల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వాహనదారుల ఇబ్బందులను సొమ్ము చేసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


