GUNTUR DISTRICT NEWS: ప్రత్యేక అధికారులు క్షేత్ర పర్యటన చేయాలి

Karthik

నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురువారం, శుక్రవారం, శనివారం – మూడు రోజులు ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతీ గురువారం ఉదయం మండల స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించి, పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్వహిస్తున్న జలధార – జల హారతి కార్యక్రమం, పదవ తరగతి తప్పిన విద్యార్థులకు నిర్వహిస్తున్న తర్ఫీదు కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే కార్యక్రమం, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఎస్.జి.ఎస్.వై నిర్వహణ, ఆసుపత్రుల సేవలు, జన గణనపై దృష్టి సారించాలని ఆదేశించారు. జన గణనలో లక్ష్యాలకు వెనుకబడి ఉన్న పొన్నూరు, తెనాలి పురపాలక సంఘాలు, తుళ్ళూరు ఇతర మండలాల్లో వేగవంతం చేయాలని ఆదేశించారు. జన గణనలో నిర్లక్ష్యం వహించే వారిని సస్పెన్షన్ చేస్తామని హెచ్చరించారు. 22 (ఎ) కేసులను పరిష్కరించడంలో చొరవ చూపించాలని అన్నారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి రియల్ టైమ్ పర్యవేక్షణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కంట్రోల్ రూమ్ నుండి సమాచారం, సందేశం వచ్చిన వెంటనే నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, క్షేత్ర స్థాయి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ,జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన,జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, సర్వే శాఖ ఉపసంచాలకులు తోయజాక్షజ రావు, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review