విజయవాడ, నవంబర్ 25:– ఎన్టీఆర్ జిల్లాలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గురువారం (నవంబర్ 26) జరగనున్న ఈ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.
బుధవారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను స్వయంగా పరిశీలించి సిబ్బందికి కీలక సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తొలిదశ ఎన్నికల వివరాలను వెల్లడించారు.
మండలాల వారీగా ఎన్నికల చిత్రం: తొలిదశలో భాగంగా మొత్తం 73 గ్రామ పంచాయతీలు, 856 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే 5 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
- విజయవాడ డివిజన్: జి.కొండూరు (22 పంచాయతీలు, 224 వార్డులు), విజయవాడ రూరల్ (16 పంచాయతీలు, 226 వార్డులు), మైలవరం (13 పంచాయతీలు, 154 వార్డులు), ఇబ్రహీంపట్నం (10 పంచాయతీలు, 116 వార్డులు).
- తిరువూరు డివిజన్: రెడ్డిగూడెం మండలంలో 12 పంచాయతీలు, 136 వార్డులకు పోలింగ్ జరగనుంది.
పోలింగ్, కౌంటింగ్ వేళలు ఇవే.. మొత్తం 1,001 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్, లైటింగ్ ఏర్పాట్లు చేశారు.
నిఘా నీడలో పోలింగ్ కేంద్రాలు.. ఎన్నికల విధుల కోసం సుమారు 9,000 మంది సిబ్బందిని నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన యంత్రాంగం.. అక్కడ 600 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడంతో పాటు వెబ్‌క్యాస్టింగ్, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా నిరంతర నిఘా ఉంచనుంది.Vijayawada City News
ఉల్లంఘనులకు కలెక్టర్ వార్నింగ్: ఓటర్లను ప్రలోభపెట్టినా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు లేదా సమాచారం కోసం కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నంబర్ 91549 70454 ను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.



