GUNTUR DISTRICT NEWS: ప్రయాణీకులకు వైద్య శిబిరాలు నిర్వహణ

Karthik

ప్రయాణీకులకు వైద్య శిబిరాలను గుంటూరు, తెనాలి ఆర్.టి.సి బస్ స్టేషన్ లో నిర్వహించామని జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలను బస్ స్టాండ్ లలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారని తెలిపారు. గుంటూరు బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ప్రయాణాల సమయంలో వడ గాల్పులు వలన వడ దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయని, డీహైడ్రేషన్ కు గురి కావచ్చని వాటికి సరైన చికిత్స సకాలంలో అవసరమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ సౌజన్యంతో వైద్య శిబిరాలను గుంటూరు, తెనాలిలో ఏర్పాటు చేశామని చెప్పారు. బస్ స్టేషన్ లో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఇతర బస్ స్టేషన్ లలో ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాథమికంగా అవసరమగు మందులను శిబిరాల్లో పెట్టడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review