గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విమానంలో విజ్ఞాన విహారయాత్రగా ఢిల్లీకి తీసుకువచ్చిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి పర్యటనలు విద్యార్థులు తరగతి గదులకు అతీతంగా నేర్చుకోవడానికి, వారి ఆలోచనా పరిధులను విస్తరించుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జీవితంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ ఎన్నో పోరాటాలు, వైఫల్యాలు, ఎదురుదెబ్బలను ఎదుర్కొని ముందుకు వచ్చారని, విద్యార్థులు తమ ఆర్థిక పరిస్థితులను చూసి ఎప్పుడూ నిరుత్సాహపడకూడదని సూచించారు. విద్యే జీవితంలో ఉన్నత స్థానాలకు చేర్చే అత్యంత శక్తివంతమైన సాధనమని, జాతీయ ప్రగతికి విద్య ప్రధాన బలం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే దేశ భవిష్యత్తును మార్చగలరని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై మరింత దృష్టి సారించి ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా విద్యార్థులను అభినందిస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటే సామర్థ్యం కలిగి ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి, పెద్ద లక్ష్యాల వైపు నడిపించడమే ఈ విజ్ఞాన విహారయాత్ర లక్ష్యమని తెలిపారు. ఉపరాష్ట్రపతిని కలవడం తమ జీవితంలో మరపురాని అనుభవమని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.



