బాపట్ల జిల్లా :-పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాంగ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలంలోని పెద్దగంజాం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
వైద్య రంగంలో నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మంచి గుర్తింపు పొందిన ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ వారు గ్రామ పెద్ద కీర్తిశేషులు ఆసోది అంజి రెడ్డి గారి జ్ఞాపకార్థం పెద్దగంజాం గ్రామంలోని రచ్చబండ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అలాగే గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అవసరమైన సూచనలు, జాగ్రత్తలను వివరించారు. ఇటీవల నిర్మించిన నూతన క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా క్యాన్సర్ బాధితులకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్య బృందం వెల్లడించింది.
ఈ వైద్య శిబిరంలో 250 మందికి పైగా ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోగా, వారిలో 55 మందికి వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వారికి ఒంగోలు కిమ్స్ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ, ఈహెచ్ఎస్, ఈసిహెచ్ఎస్, రైల్వే, ఎఫ్‌సీఐ కార్డుల ద్వారా ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని కిమ్స్ హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ రఫీ తెలిపారు.
ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామాంజనేయులు, ఆప్టోమెట్రిస్ట్ స్వాతి, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



