GUNTUR CITY NEWS: తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి

Karthik

గుంటూరు నగరంలో ప్రస్తుత వేసవిలో త్రాగునీటి సరఫరాకి ఏ సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి వార్డ్ లో ఎమినిటి కార్యదర్శులు తప్పనిసరిగా క్లోరిన్ శ్యాంపిల్స్ తీసి సిఎంఎం యాప్ లో అప్ లోడ్ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం ఐపిడి కాలనీ రిజర్వాయర్, సంగం జాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి, తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నీటి కొరత రావడానికి వీలు లేదన్నారు. అలాగే త్రాగునీటి సరఫరాలో కలుషిత ఫిర్యాదులు అందుతున్నాయని, వార్డ్ సచివాలయాల వారీగా పైప్ లైన్ ఆడిట్ చేసుకోవాలని, ఎక్కడైనా సమస్య గుర్తిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. త్రాగునీటి సరఫరాపై అందే ఫిర్యాదుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. సంగం జాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని పరిశీలించి, నగరానికి సరఫరా చేసే త్రాగునీటిలో క్లోరిన్ తగు మోతాదులో ఉండేలా చూసుకోవాలన్నారు. ట్యాంక్ లో నీటి పరిమాణం వివరాలు అడిగి తెలుసుకొని, కొమ్మమూరు చానల్ లో ప్రవాహం ఉన్నప్పుడు పంపింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాలని, వ్యర్ధాలు తడిపొడిగా వేరు చేసి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. జాతీయ రహదారి వెంబడి కొబ్బడి బొండాలు, తాటి ముంజల వ్యర్దాలు వేస్తున్నారని, ప్రత్యేక బృందాల ద్వారా వేసే వారిని గుర్తించి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలన్నారు. పర్యటనలో అదనపు కమిషనర్ జి.సాంబశివరావు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈలు సుందర్రామిరెడ్డి, విష్ణు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review