చేబ్రోలు మండలం సేకూరు చానెల్ పునరుద్ధరణ పనులను జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం మంగళవారం సంయుక్తంగా పరిశీలించారు. జలధార జల హారతి కార్యక్రమం, ఉపాధి హామీ పథకం క్రింద జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు బాగా తక్కువగా ఉన్న గ్రామాల్లో సేకూరు ఒకటి. భూగర్భ జలాలు పెరుగుదలకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయుటకు అవకాశం ఉన్న మూడు ప్రదేశాలను గుర్తించారు. జలధార జల హారతి కార్యక్రమం, ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపడుతున్న పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్ తెలిపారు. వర్షాకాలం నాటికి జిల్లాలో గుర్తించి చేపడుతున్న చెరువు పనులను పూర్తి చేసి సిద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భూగర్భ జలాలు పెంపుదలకు ప్రజలు భాగస్వామ్యం, సహకారం అవసరమని జిల్లా భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం కోరారు.



