చిన్నగంజాం:– చిన్నగంజాం మండలానికి సంబంధించిన కోర్టు కేసులను ప్రస్తుతం కొనసాగుతున్న చీరాల కోర్టు పరిధి నుంచి పర్చూరు కోర్టుకు తరలించకూడదని ప్రజాసంఘాల ఐక్యత కన్వీనర్ జి. ప్రతాప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం చిన్నగంజాం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జి. ప్రతాప్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా చిన్నగంజాం మండలానికి సంబంధించిన కేసులు చీరాల కోర్టులోనే విచారణకు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం చిన్నగంజాం కేసులను పర్చూరు కోర్టుకు తరలించే ఆలోచనలో ఉందనే సమాచారం అందిందని పేర్కొన్నారు.
కోర్టు కేసుల నిమిత్తం ప్రజలు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుందని, పర్చూరుకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం చిన్నగంజాం మండల కేసులను చీరాల కోర్టు పరిధిలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నిరసన కార్యక్రమం అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



