Mangalagiri Local News :నిడమర్రు ఆర్వోబీకి మంత్రి లోకేష్ శంకుస్థాపనరూ.142 కోట్లతో నిర్మాణం.. మంగళగిరి-అమరావతి అనుసంధానానికి కీలక అడుగు

Sharat
1 View

మంగళగిరి, జూన్ 17 :-మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపునిస్తూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు.

నంబూరు-మంగళగిరి రైల్వే సెక్షన్‌లోని 14వ నంబర్ లెవల్ క్రాసింగ్ గేటు స్థానంలో నిర్మించనున్న ఆర్వోబీకి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌లకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.

మంత్రి లోకేష్ చొరవతో రూ.142 కోట్ల వ్యయంతో ఈ ఆర్వోబీ నిర్మాణానికి అనుమతులు లభించాయి. దశాబ్దాలుగా రైల్వే గేటు మూసివేత కారణంగా ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు ఈ వంతెన శాశ్వత పరిష్కారంగా నిలవనుంది. మంగళగిరి, నిడమర్రు, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

ప్రస్తుతం రోజుకు సుమారు 60 రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో రైల్వే గేటు సగటున 8 నుంచి 10 గంటల పాటు మూసివేయబడుతోంది. దీంతో ప్రయాణికులు 10 నుంచి 15 నిమిషాల వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే కేవలం నిమిషంలోనే ఈ మార్గాన్ని దాటే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.

సుమారు 767.50 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ ఆర్వోబీ రైల్వే లైన్‌పై 10 మీటర్ల ఎత్తులో ఉండనుంది. నాలుగు లైన్ల రహదారితో పాటు రెండు వైపులా సర్వీస్ రోడ్లు, క్రాష్ బ్యారియర్లు, డివైడర్‌లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 28 మీటర్ల వెడల్పుతో ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.

ఈ ఆర్వోబీ నిర్మాణంతో మంగళగిరి నుంచి అమరావతికి ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా బేతపూడి, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ గ్రామాల ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలగనుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధికి కూడా ఇది దోహదపడనుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనుంజయ్, పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review