చిన్నగంజాం, జూన్ 17:-బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలంలోని సంతరావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గోనసపూడి గ్రామంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సంతరావూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బి. నాగేంద్ర మాట్లాడుతూ, దోమల ద్వారా వ్యాపించే మలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జూన్ 1 నుంచి జూన్ 30 వరకు ఆరోగ్య శాఖ ప్రత్యేక అవగాహన మాసంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ నెల రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, దోమతెరలను వినియోగించడం వంటి చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నీరు నిల్వ ఉండనివ్వకుండా దోమల నివారణ చర్యలు చేపట్టాలని, ఆరోగ్య శాఖ సూచనలను పాటించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
“దోమలను అరికడదాం… ఆరోగ్యాన్ని కాపాడుకుందాం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ బి. శిరీష, ఏఎన్ఎం పి. పద్మలత, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



