అమరావతి, ఆగస్టు 6:– రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బ్యాంకర్లను ఆదేశించారు. సచివాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో పాటు ఎంఎస్ఎంఈ అసోసియేషన్ల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” కార్యక్రమం విజయవంతం కావాలంటే ఎంఎస్ఎంఈలకు సకాలంలో రుణాలు అందడం అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే బ్యాంకర్లతో చర్చించి, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో స్పష్టమైన దిశానిర్దేశం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంఎస్ఈ-సీడీపీ, పీఎంఈజీపీ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ఏపీ చీఫ్ మినిస్టర్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రామ్ సమర్థవంతంగా అమలుకు బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని మంత్రి కోరారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలకు రుణాల మంజూరులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) పరిధిలో రుణాలను కవర్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దేశంలో నాలుగో స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని తొలి స్థానంలో నిలిపేందుకు బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో ఎంఎస్ఎంఈ అసోసియేషన్ల ప్రతినిధులు పలు సమస్యలు, సందేహాలను మంత్రి దృష్టికి తీసుకురాగా, బ్యాంకు అధికారులు వాటిపై వివరణ ఇచ్చి రుణాలు, ఇతర ఆర్థిక సదుపాయాలపై అవగాహన కల్పించారు. అలాగే ఎంఎస్ఎంఈ ఔత్సాహికులు ఒకే వేదిక ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకునేలా యూనిఫైడ్ ఆన్‌లైన్ పోర్టల్ రూపొందించి అందుబాటులోకి తీసుకురావాలని పరిశ్రమల శాఖ కార్యదర్శికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్. యువరాజ్, ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో విశ్వమనోహరన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్, జాయింట్ డైరెక్టర్ విజయరత్నంతో పాటు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, క్రెడాయ్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు



