ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని 76 డివిజన్లలో వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమైందని, ఈ మొత్తం ప్రక్రియను 23 నుండి అక్టోబరు 1 వరకు అత్యంత పారదర్శకంగా పూర్తి చేయనున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో వార్డ్ ల రిజర్వేషన్ ఖరారు సర్వే, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, విభాదిపతులతో సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబరు 23 నుండి 25 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేకంగా నియమించబడిన సర్వే సిబ్బంది వార్డులు, పోలింగ్ స్టేషన్ల వారీగా ఇంటింటికీ వచ్చి ఓటర్ల జాబితాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తిస్తారని తెలిపారు. సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ఫారమ్-1 ద్వారా సెప్టెంబరు 26న నగర పాలక సంస్థ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం, సెప్టెంబరు 27, 28 తేదీల్లో ప్రజల నుండి అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరిస్తామని, ఈ క్రమంలో పేర్ల నమోదు లేదా గుర్తింపు కోసం ఫారమ్-2లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల కోసం ఫారమ్-3లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. దాఖలైన క్లెయిమ్‌ల వివరాలను ఫారమ్-4 ద్వారా కార్యాలయ నోటీసు బోర్డుపై ప్రదర్శించడంతో పాటు, అభ్యంతరాలకు సంబంధించి ఫారమ్-5 ద్వారా సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం సెప్టెంబరు 29, 30 తేదీలలో వెరిఫికేషన్ అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారని, విచారణ పూర్తయిన తర్వాత, సవరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల తుది జాబితాను ఫారమ్-6 రూపంలో అక్టోబరు 1న అధికారికంగా ప్రచురించి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన కమిషనర్ & డైరెక్టర్ కార్యాలయానికి సమర్పిస్తామని తెలిపారు. నగర ప్రజలందరూ తమ వివరాలను సరిచూసుకుంటూ ఈ సర్వే ప్రక్రియకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.ఎన్నికల నిర్వహణపై కమిషనర్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ లిస్టు మేరకు రిటర్నింగ్ అధికారులు వారి పరిధిలోని కేంద్రాల్లో నిర్దేశిత ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు మౌలిక వసతులను పరిశీలించి, ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటితో కలిపి నివేదిక ఇవ్వాలన్నారు. రిటర్నింగ్ అధికారులతో ఏఈలు సమన్వయం చేసుకోవాలని ఎస్ఈకి తెలిపారు. అలాగే వార్డ్ ల వారీగా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలను గుర్తించాలని, అవకాశం ఉన్న వరకు వార్డ్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండేలా చూడాలన్నారు. బ్యాలెట్ బాక్స్ లను భద్ర పరచే కేంద్రాలను ఫైనల్ చేయాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన మెటీరియల్ అందించేందుకు టెండర్ సిద్దం చేయాలని ఎస్ఈని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు, పిఓ, ఏపిఓలకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో డిప్యూటీ కమిషనర్ భాధ్యత తీసుకోవాలన్నారు. ఎన్నికల విభాగంతో ఇతర విభాగాలను డిప్యూటీ కమిషనర్ -2 చేయాలన్నారు. అన్ని విభాగాధిపతులు ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై వ్రాత పూర్వక నివేదికలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఏఓ తిరుపతి నాయుడు, మేనేజర్ బాలాజీ బాష, ఎన్నికల విభాగ సూపరిండెంట్ పద్మ పాల్గొన్నారు.



