Eluru Distric news :పాపికొండలకు వెళ్తున్న బోటు సాంకేతిక లోపంతో గోదావరి నదిలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన

Sharat
2 Views


పోలవరం జిల్లాలోని ప్రసిద్ధ పాపికొండల విహారయాత్రలో శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు సాంకేతిక లోపంతో గోదావరి నదిలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటు ద్వారా పర్యాటకులను సురక్షితంగా గమ్యస్థానానికి తరలించారు. అయితే బోటులో ప్రయాణికులకు లైఫ్ జాకెట్ల వినియోగంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి శుక్రవారం ఉదయం సుమారు 89 మంది పర్యాటకులతో ఓ బోటు పాపికొండల విహారయాత్రకు బయలుదేరింది. ప్రయాణం కొనసాగుతున్న సమయంలో దేవీపట్నం పాత పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోగానే బోటులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బోటు డ్రైవర్ అప్రమత్తమై బోటును నిలిపివేసి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న కంట్రోల్ రూమ్ అధికారులు వెంటనే స్పందించి జలశ్రీ బోటును సంఘటనా స్థలానికి పంపించారు. అనంతరం పర్యాటకులను సురక్షితంగా మరో బోటులోకి మార్చి విహారయాత్రను కొనసాగించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఈ ఘటనపై జలవనరుల శాఖ ఏఈ భాస్కర్ వివరణ ఇస్తూ.. ఇంజిన్‌కు సంబంధించిన సాఫ్ట్ బేరింగ్ బిగుతుగా మారడంతో సాంకేతిక సమస్య తలెత్తిందని తెలిపారు. సమస్యను వెంటనే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, శుక్రవారం ప్రయాణించిన రెండు పర్యాటక బోట్లు సురక్షితంగా తిరిగి చేరుకున్నాయని వెల్లడించారు.

అయితే ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పరిశీలిస్తే కొంతమంది పర్యాటకులు లైఫ్ జాకెట్లు ధరించకపోవడం కనిపిస్తోంది. గతంలో పర్యాటక బోటు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో భద్రతా నిబంధనల అమలుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లైఫ్ జాకెట్లు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యమా..? లేక పర్యాటకులే వాటిని ధరించకుండా ప్రయాణించారా..? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.


పాపికొండల వంటి పర్యాటక ప్రాంతాల్లో ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణిస్తున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాల అమలు అత్యంత కీలకం. చిన్న సాంకేతిక లోపమే పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉన్నందున బోట్ల ఫిట్‌నెస్, లైఫ్ జాకెట్ల వినియోగం, అత్యవసర భద్రతా చర్యలపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని పర్యాటకులు కోరుతున్నారు.

Author
Share This Article
Leave a review