వెలగపూడి :– రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన “గ్రీనింగ్ సొసైటీ” ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జులై 3వ తేదీలోగా సొసైటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
గురువారం వెలగపూడి సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రీనింగ్ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధివిధానాలన్నీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2025కు అనుగుణంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైనదని, ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయాలని ఆదేశించారు.
ప్రతి గ్రామ పంచాయతీలో తప్పనిసరిగా నర్సరీ ఏర్పాటు చేయాలని, సాధ్యం కాని చోట మూడు లేదా నాలుగు పంచాయతీలను క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఉమ్మడి నర్సరీలను అభివృద్ధి చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వీబీజీ-రామ్ జీ పథకం నిధులు, ఉపాధి దినాలను సమర్థంగా వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 2.6 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేసినట్లు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. వర్షాకాలంలో అడవులు, ఖాళీ ప్రాంతాల్లో వాటిని వెదజల్లేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. కొండ ప్రాంతాల్లో విత్తనాలు చల్లేందుకు 40 నుంచి 50 అత్యాధునిక డ్రోన్లను వినియోగించనున్నట్లు వెల్లడించారు.
దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ శాఖలకే పరిమితం చేయకుండా విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
రాష్ట్రంలో అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతుల సంరక్షణకు అటవీ శాఖ చేపడుతున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి అభినందించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని పాములేరు వాగు వద్ద గుర్తించిన అరుదైన వెదురు జాతి ‘బాంబూసా ఆంధ్రీకం’ సంరక్షణకు అధికారులు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను ప్రశంసించారు. అలాగే శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే ‘సైకాస్ శేషాచలన్సిస్’ మొక్కల సంరక్షణకు చేపడుతున్న చర్యలను కొనియాడారు.
సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



